Shivam Dube: టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ప్రతిష్టాత్మక ట్రోఫీని దక్కించుకుంది. ఈ గెలుపుతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ లోని ప్రతి ప్లేయర్ తమ ఇళ్లకు చేరుకున్నారు. కాగా ప్రపంచకప్ విజేతలుగా తిరిగొచ్చే ప్లేయర్స్ కి ఎయిర్‌పోర్ట్‌లలో ఘన స్వాగతం లభిస్తుంది. కానీ ఈసారి ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఒక ఆటగాడు మాత్రం ఎవరూ గుర్తించొద్దని సైలెంట్ గా ట్రైన్‌లో ఇంటికి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 8 బంతుల్లో 25 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబే అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. దూబే వేగంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ని భారత్ వైపు తిప్పాడు. అయితే గెలిచిన తర్వాత అతను విమానంలో కాకుండా రైలులో ప్రయాణించడం చర్చకు దారి తీసింది. ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కొన్ని గంటల్లోనే శివమ్ దూబే తన భార్య, ఒక స్నేహితుడితో కలిసి ముంబైకి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. కానీ అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లే అన్ని ఫ్లైట్ టికెట్లు అప్పటికే బుక్ అయ్యాయి. దీంతో అతనికి విమానంలో జర్నీ చేసే ఛాన్స్ దొరకలేదు. ఇలాంటి పరిస్థితిలో అతను ట్రైన్‌లో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఫస్ట్ ఏసీ టికెట్లు అందుబాటులో లేకపోవడంతో లాస్ట్ కి థర్డ్ ఏసీ కోచ్‌లో 3 టికెట్లు బుక్ చేసుకుని వెళ్లిపోయాడు.
అయితే అభిమానులు గుర్తించకుండా ఉండేందుకు శివమ్ దూబే తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అతను క్యాప్ పెట్టుకుని, ముఖానికి మాస్క్ వేసుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. స్టేషన్‌లో క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటంతో తన భార్య, ఫ్రెండ్ ని ముందుగా పంపించి, ట్రైన్ స్టార్ట్ అయ్యే ఐదు నిమిషాల ముందు ప్లాట్‌ఫారమ్‌కు చేరుకున్నాడు. రైలులో ఎక్కిన తర్వాత అప్పర్ బెర్త్‌పై పడుకుని రెస్ట్ తీసుకున్నాడు. టికెట్ చెకర్ అతడి పేరు చూసి షాక్ అయ్యాడు. అతని భార్య అది క్రికెటర్ శివమ్ దూబే కాదని చెప్పడంతో విషయం అక్కడితో ముగిసిపోయింది.
ఇక చివరికి ఎవరూ తనను గుర్తించకుండానే శివమ్ దూబే సురక్షితంగా ముంబై చేరుకున్నాడు. బోరివలి స్టేషన్ దగ్గర గుర్తించే ఛాన్స్ ఉండటంతో స్థానిక పోలీసులను సంప్రదించగా వారు అతనికి సహాయం చేశారు. తన పిల్లలను త్వరగా కలవాలనే కోరికతోనే ఇలా త్వరగా ఇంటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు శివమ్ దూబే తెలియజేశాడు.
